ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. అరవింద్ కేజ్రీవాల్ జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలిసింది. ప్రస్తుతం కేజ్రీవాల్ సమావేశాలన్నీ రద్దు చేసుకుని స్వీయనిర్బంధంలో ఉండిపోయారు. కేజ్రీవాల్‌కు మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో 28,936 కరోనా కేసులు నమోదు కాగా 812మంది మరణించారు.
లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో మళ్లీ మమూలు జనజీవనం నెలకొంది. ఆలయాలు, చర్చిలు, మసీదులు, గురుద్వారాలు తెరుచుకున్నాయి. మూడు నెలల తర్వాత ఆలయాలు తెరుచుకోవడంతో దర్శనాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రార్థనా మందిరాల వద్ద భక్తుల రద్దీ పెరిగింది. జమా మసీదు, హనుమాన్ మందిర్, గౌరీ శంకర్ ఆలయం, సాయిబాబా మందిర్, కల్కాజీ తదితర మందిరాలు తెరుచుకున్నాయి. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీ సరిహద్దుల్లో రాకపోకలు ప్రారంభమయ్యాయి. అయితే కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి.
మరోవైపు.. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం, పౌరులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కూడా కరోనా కేసులు పెద్దగా తగ్గుముఖం పట్టట్లేదు. గత 24 గంటల్లో దేశంలో 9,983 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో కరోనా వైరస్ కారణంగా 206 మంది చనిపోయారు.