టీకా ఉత్సవ్‌.. కరోనాపై రెండో యుద్ధానికి నాంది : ప్రధాని మోడీ

ఆదివారం, 11 ఏప్రియల్ 2021 (13:42 IST)
దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభం కానున్న ‘టీకా ఉత్సవ్‌’ను కరోనాపై చేయబోతున్న రెండో యుద్ధానికి నాందిగా ప్రధాని నరేంద్ర మోడీ అభివర్ణించారు. ఏప్రిల్‌ 11, జ్యోతిబా ఫులే జయంతి రోజు ప్రారంభమవుతున్న ఈ మహాక్రతువు డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ జన్మదినమైన ఏప్రిల్‌ 14న ముగియనుందంటూ రెండు తేదీలకు ఉన్న విశిష్టతను ప్రధాని గుర్తుచేశారు. 
 
ఇకపై వ్యక్తిగత శుభ్రతతో పాటు, సామాజిక పరిశుభ్రతపై కూడా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాలుగు విషయాలను దృష్టిలో ఉంచుకోవాలని మోడీ కోరారు. ఈ మహా క్రతువులో భాగంగా ప్రతిఒక్కరు- మరొకరికి టీకా వేయించాలని కోరారు. చదువుకోని వారు, వృద్ధులు.. ఇలా ఎవరైతే స్వయంగా వెళ్లి టీకా వేయించుకోలేని స్థితిలో ఉన్నారో వారికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. 
 
వనరులు, అవగాహన లేక ఇబ్బంది పడుతున్న వారికి కరోనా చికిత్స అందజేయడంలో అండగా ఉండాలని కోరారు. మనం స్వయంగా మాస్క్‌ ధరించి మనల్ని మనం రక్షించుకోవాలి. ఇతరుల్ని కూడా రక్షించాలి. దీనికి ప్రతిఒక్కరూ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి కోరారు 
 
ఎవరైనా కరోనా బారిన పడితే.. వారి చుట్టుపక్కల ప్రజలు ‘మైక్రోకంటైన్‌మెంట్‌ జోన్‌’ ఏర్పాటుకు ముందుకు రావాలి. ఒక్క కేసు వెలుగులోకి వచ్చినా.. వారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారు ఇలాంటి జోన్‌ను సృష్టించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
 
భారత్‌ వంటి అధిక జనాభా కలిగిన దేశంలో కరోనాను పారదోలేందుకు ‘మైక్రోకంటైన్‌మెంట్‌ జోన్‌’ విధానం అత్యంత ప్రాముఖ్యం గల అంశమని ప్రధాని నొక్కి చెప్పారు. ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ అయిన వెంటనే.. వారితో సంబంధం ఉన్నవారంతా పరీక్షలు చేయించుకోవడం అత్యంత ముఖ్యమైన విషయమని తెలిపారు. 
 
అర్హత ఉన్నవారంతా టీకా వేయించుకునేలా చూడడం అక్కడి సమాజంతో పాటు పాలనా యంత్రాంగం బాధ్యత అని మోదీ గుర్తు చేశారు. కరోనా టీకా వృథాను పూర్తిగా అరికట్టాలన్నారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్ల ఏర్పాటు, అవసరం లేకుంటే ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఉండడం, అర్హత ఉన్నవారంతా వ్యాక్సిన్‌ వేయించుకోవడం, మాస్కు ధరించడంతో పాటు ఇతర నిబంధనల్ని తు.చ. తప్పుకుండా పాటించడంపైనే కరోనాపై మనం చేస్తున్న పోరులో విజయం ఆధారపడి ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. 
 
టీకా ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశంలో అర్హులైనవారిలో వీలయినంత ఎక్కువ మందికి టీకాలు వేయాలన్న లక్ష్యంతో టీకా ఉత్సవ్‌ను చేపట్టారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు వ్యాక్సిన్‌ వేసుకోవాలంటూ ఉత్తర్‌ప్రదేశ్‌, బిహార్‌ తదితర రాష్ట్రాలు ప్రజలను కోరాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు