ఉత్తరప్రదేశ్‌లో కమలదళాన్ని అయోధ్య రాముడు ఎందుకు గట్టెక్కించలేదు?

వరుణ్

బుధవారం, 5 జూన్ 2024 (17:59 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చావు దెబ్బ తగిలింది. 84 ఎంపీ సీట్లు ఉన్న ఈ రాష్ట్రంలో బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. పైగా బీజేపీ పాలనలో ఈ రాష్ట్రం ఉంది. కానీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు మరోలా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీకి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. ఫలితంగా కమలం పార్టీకి తేరుకోలేని షాకిచ్చారు. నిజానికి కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్‍‌ సారథ్యాల్లో బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఊకదంపుడు ప్రచారం చేసుకున్నారు. 
 
ఈ ప్రచారం యూపీ ఓటర్ల మనసులను గెలుచుకోలేక పోయింది. పైగా, అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా ఆ పార్టీకి ఓట్లు కురిపించలేక పోయాయి. అయోధ్య గుడి ఉన్న ఫైజాబాద్‌లో కూడా బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇలా అనేక అంశాల్లో డబుల్‌ ఇంజిన్‌ మొరాయించి ఫలితాలు ఇవ్వలేదు. దీంతో తప్పు ఎక్కడ జరిగిందనే అంశంపై ఇప్పుడు కమలనాధుల్లో అంతర్మథనం మొదలైంది. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ బలమైన సోషల్‌ ఇంజినీరింగ్‌తో ఈసారి ఎన్నికలకు సిద్ధమైంది. ఈ క్రమంలో పీడీఏ (వెనుకబడిన, మైనార్టీ, దళిత్‌) వ్యూహంతో ఆ వర్గాల ఓటర్లను ఆకర్షించింది. 
 
రాష్ట్రంలో నాలుగు ఎన్నికల్లో విజయానికి యోగి నేతృత్వం వహించారు. 2022 అసెంబ్లీ, 2019 లోక్‌సభ, రెండు స్థానికసంస్థల ఎన్నికలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటిల్లో భాజపా విజయాలు సాధించింది. ఈసారి టికెట్ల కేటాయింపుల్లో అభ్యర్థులపై స్థానిక వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలూ ఉన్నాయి. రాష్ట్రంలో పార్టీ ఓటమికి అదే బలమైన కారణంగా నిలిచింది. యోగి ఆదిత్యనాథ్ మాత్రం టికెట్ల కేటాయింపును పూర్తిగా కేంద్ర నాయకత్వానికే వదిలేసినట్లు తెలుస్తోంది. కాకపోతే ప్రచార బాధ్యత యోగి తీసుకొన్నారు. ఆయన రాష్ట్రంలో, బయట 170 ర్యాలీలు నిర్వహించడంతోపాటు.. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో పర్యటించారు. 
 
రామాలయం నిర్మించిన అయోధ్యలో (ఫైజాబాద్‌)లో భాజపా ఓడిపోవడాన్ని పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. బీజేపీకి జీవం పోసిన అయోధ్య ఉద్యమానికి ఓ సానుకూల ముగింపు ఇచ్చినా.. ఎస్పీ అభ్యర్థి అవధేష్‌ ప్రసాద్‌నే విజయం వరించింది. దీంతో ఈ అంశం తమకు ఎన్నికల్లో ఉపయోగపడలేదని పార్టీ అంచనా వేసింది. 
 
ఇంకోవైపు, యూపీలో బీఎస్పీ బలహీనపడటం కూడా కాంగ్రెస్‌-సమాజ్‌వాదీకి కలిసొచ్చింది. 2014లో బీఎస్పీకి సీట్లు రాకపోయినా.. 2019లో పుంజుకొని 10 చోట్ల విజయం సాధించింది. అప్పట్లో సమాజ్‌వాదీ పార్టీతో జట్టు కట్టింది. కానీ, ఈసారి సొంతంగా బరిలో నిలవడంతో గతంలో వచ్చిన 19 శాతం ఓట్లను నిలబెట్టుకోలేక సింగిల్‌ డిజిట్‌కు పరిమితమైంది. రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్‌-సమాజ్‌వాదీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఫలితంగా బీఎస్పీ ఓట్లు వాటికి మళ్లాయి. దీంతో రాష్ట్రంలో ఇండియా కూటమి ఓట్ల శాతం 40 శాతానికి చేరింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు