బాత్రూంలో బోషాణం... రూ. 5.7 కోట్లు కొత్త కరెన్సీ... ఆ 2000లో ఏదో ఉందా...?

శనివారం, 10 డిశెంబరు 2016 (20:21 IST)
నరేంద్ర మోదీ ప్లాన్ పక్కాగా అమలవుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరైతే కోట్లకొద్ది కొత్త నోట్లను కుప్పలుగా ఇంట్లో పోసుకున్నారో వారిని ఈ కొత్త రూ.2000 నోట్లు చక్కగా పట్టిచ్చేస్తున్నాయి. ఇప్పుడు రూ.2000 కరెన్సీ కొత్త నోట్లను ఇంట్లో కుప్పలు పోసుకున్నవారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు... రేపు కాకపోతే మరో నాలుగైదు రోజుల తర్వాత ఐటీ అధికారులు వారి తలుపులు తట్టవచ్చు. రూ. 2000 కట్టలున్న గోడలను పగులగొట్టవచ్చు.
 
తాజాగా బెంగళూరులో బయటపడ్డ ఉదంతం షాక్‌కి గురిచేస్తోంది. బాత్రూంలో ఎవరి కంటికి కనిపించకుండా 4 అడుగులు ఎత్తు, 2 అడుగులు వెడల్పు ఉన్న ఓ రహస్య గదిని నిర్మించారు. ఐటీ అధికారులు అక్కడికి వెళ్లి దానిని పరిశీలించి ఓ దెబ్బ కొట్టగానే తలుపు తెరుచుకుంది. తలుపు తీసి లోపలికి తొంగి చూస్తే డబ్బు కట్టలు, బంగారు బిస్కెట్లు. డబ్బు రూ.5.7 కోట్ల రూ.2000 కొత్త కరెన్సీ కాగా 90 లక్షల పాత నోట్లున్నాయి. ఇక 28 కేజీల బంగారం బిస్కెట్లు, 4 కేజీల బంగారు ఆభరణాలు కనుగొన్నారు. ఇతడు బెంగళూరులో హవాలా వ్యాపారం చేస్తుంటాడని తేలింది. ఇతడు కన్నడ సీనియర్ నటుడు దొడ్డన్నకు బంధువుగా గుర్తించారు.

వెబ్దునియా పై చదవండి