బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఇదే.. 2 దశల్లో పోలింగ్

ఠాగూర్

సోమవారం, 6 అక్టోబరు 2025 (17:17 IST)
బీహార్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను భారత ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఇందులోభాగంగా, నవంబరు 6వ తేదీన తొలి దశ, నవంబరు 11వ తేదీన రెండో దశ పోలింగ్ జరుగుతుంది. నవంబరు 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు.
 
బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 శాసనసభ స్థానాలున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల చివరి వారంతో ముగియనుంది. ప్రస్తుతం బీహార్‌లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో ఉంది. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో జేడీయూ, భాజపా కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 
 
నీతీశ్ కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కానీ, రెండేళ్లకే నీతీశ్ ఎన్డీయేను వీడి.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో మహాగఠ్‌ బంధన్‌లో చేరి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే, ఈ బంధమూ ఎంతోకాలం నిలవలేదు. 2024 జనవరిలో మహా కూటమిని వీడిన జేడీయూ మళ్లీ ఎన్డీయేతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. దీంతో మరోసారి నీతీశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు