బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మూడు దశల్లో జరుగనున్నాయి. ఇందులోభాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ ఈ వారాంతంలో జరుగనుంది. అయితే, ఈ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. దీన్ని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ గురువారం మీడియాకు రిలీజ్ చేశారు.
ఇందులో బీహార్‌లో కరోనా వ్యాక్సిన్‌ని అందరికీ ఉచితంగా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం. ముఖ్యంగా, బీహార్‌లో ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది ఈ ఎన్నికల మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అని ఆమె చెప్పుకొచ్చారు.
బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేయడం, 30 లక్షల మందికి పక్కా ఇళ్లు, 9వ తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది.
కాగా, బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా, ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు.