యేసయ్యా మరియ తనయా.. పూర్వా సంధ్యా ప్రవర్తతే... ఆంధ్రప్రదేశ్ కాదు.. ఆంగ్లాంధ్రప్రదేశ్...

బుధవారం, 21 అక్టోబరు 2020 (18:00 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి సర్కారుపై ఆ పార్టీకి చెందిన రెబెల్ ఎంపీ రఘురామరాజు (నరసాపురం) మరోమారు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మరికొద్ది రోజుల్లో రామరాజ్యం కాస్త క్రైస్తవ రాజ్యంగా మారుతుందని ఆయన జోస్యం చెప్పారు. అంతేకాకుండా కోట్లాది మంది పఠించే సుప్రభాతాన్ని కూడా వైకాపా సర్కారు మార్చివేస్తుందన్నారు. 
 
ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ, రామరాజ్యాన్ని క్రైస్తవ రాజ్యం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. 'కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే.. ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్' అంటూ మన చదువుకుంటున్న సుప్రభాతం.. ప్రభుత్వ చర్యలును అరికట్టక పోతే... 'యేసయ్యా మరియ తనయా.. పూర్వా సంధ్యా ప్రవర్తతే' అని పాడుకోవల్సిన ప్రమాదం ఉందని హెచ్చరించారు. 
 
క్రైస్తవ మత వ్యాప్తిని అడ్డుకోకపోతే.. హిందూ ధర్మానికి అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఒక మతాన్ని పోత్సహిస్తున్న ప్రభుత్వ చర్యలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హిందూ స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించాలని సూచించారు. 
 
అంతేకాకుండా, బీసీల్లో కులానికో సొసైటీ పెట్టి చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విభజించి, పాలించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం ఆపాలన్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘనపై ప్రధానికి లేఖ రాశానని తెలిపారు. 1.8 శాతం ఉన్న క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రాధాన్యతపై.. విచారణ జరిపి నిజాలు నిగ్గుతేల్చాలని ప్రధానిని కోరానన్నారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్‌లో.. తెలుగు భాషకు ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేసిన రఘురామరాజు... ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మాతృభాష అయిన తెలుగును సమాధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఎంతో పవిత్రంగా భావించే భారత రాజ్యాంగాన్ని చులకనగా భావించే ప్రభుత్వం.. తెలుగు భాషను కేంద్ర విద్యా విధానికి వ్యతిరేకంగా పనిచేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఆంగ్లాంధ్రప్రదేశ్‌గా మార్చాలను చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు