ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రజనీకాంత్, కమల్ హాసన్‌ల గురించే చర్చ జరుగుతోంది. రజనీకాంత్ పార్టీ పేరును ఎప్పుడు ప్రకటిస్తారు.. కమల్ హాసన్ కూడా ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాలవైపు అడుగులు వేస్తారని ఆశక్తిగా తమిళనాడు ప్రజలు ఎదురుచూస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రజలే కాదు.. యావత్ దేశం మొత్తం కూడా ఇద్దరు లెజెండ్ హీరోల రాజకీయాలపైనే దృష్టి కేంద్రీకరిస్తోంది.
అయితే రజనీకాంత్ మాత్రం తన పార్టీ గుర్తు, పార్టీ పేరును త్వరలో వెల్లడిస్తానని, కాస్త సమయం కావాలని అడిగితే, కమల్ హాసన్ మాత్రం ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. కమల్ పుట్టిన రామనాథపురం నుంచే ఈ యాత్ర ప్రారంభమవుతోంది. కమల్ హాసన్ ముందు నుంచీ ఒకటే చెబుతూ వస్తున్నారు... స్వచ్ఛమైన పాలన అందించడమే తన ముఖ్య ఉద్దేశమంటున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేసుకుంటున్నారు.
అయితే కమల్ హాసన్‌ను తమవైపు తిప్పుకునే ప్రయత్నాలను బీజేపీ ప్రారంభించింది. తమిళనాడులో ఎప్పటి నుంచో పాగా వేయాలనుకుంటున్న బీజేపీ గతంలో రకరకాల ప్రయత్నాలు చేసింది. రజనీకాంత్ సొంతంగా వెళ్ళాలనుకుని నిర్ణయం తీసుకుంటున్న తరుణంలో ఇక మిగిలింది కమల్ హాసన్ ఒక్కరే కాబట్టి ఆయన్ను తమవైపు తిప్పుకునే ప్రయత్నం ప్రారంభించింది.
గతంలో బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన కమల్ హాసన్ ఆ పార్టీవైపు ఎందుకు వెళతారు.. ఆయన కూడా రజనీలాగా స్వతంత్రంగానే పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళతారే తప్ప ఏ పార్టీతోనే, ఏ నాయకుడితోనే కలిసే ప్రసక్తే లేదంటున్నారు. మరి చూడాలి కమల్ ఎలాంటి వ్యూహాలతో రాజకీయ గోదాలోకి దూకుతారనేది.