సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు ఆజం ఖాన్ లోక్‌సభ ప్యానెల్ స్పీకర్ రమాదేవి (బీజేపీ)ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరుగుతుండగా ఆజంఖాన్ మాట్లాడుతూ.. మీ కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ మాట్లాడాలని ఉందని రమాదేవిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలో ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. కాగా, ఎంపీ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్‌పై బీజేపీ నేత ఆఫ్తాబ్ అద్వానీ మండిపడ్డారు.
ప్యానెల్ స్పీకర్ రమాదేవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆజంఖాన్ తల తెగనరికి పార్లమెంట్ ద్వారానికి వేలాడదీయాలని కోరారు. రమాదేవిపై ఆజం ఖాన్ వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని, అందువల్ల ఆజం తలను తెగనరకాలని, పార్లమెంటు ద్వారానికి వేలాడదీయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. తద్వారా మహిళలను అవమానిస్తే ఏం జరుగుతుందో ఆజంఖాన్, అసదుద్దీన్ ఓవైసీ వంటి వారికి తెలిసొస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆజంఖాన్ తొలుత జయప్రదపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు రమాదేవిని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఖండించాల్సిన విషయమన్నారు. ఈ పెద్దమనిషికి పిచ్చెక్కిందని తాను ఇది వరకే చెప్పానని గుర్తుచేశారు. దేశానికి హానికరంగా తయారవుతున్న పిచ్చి కుక్కను చంపాల్సిందేనని ఆఫ్తాబ్ తేల్చి చెప్పారు.