నల్లధనం కలిగిన అవినీతిపరుల భరతం పడుతామంటూ రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసిన కేంద్రానికి నాటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ విమర్శించారు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు కాకమునుపే బీజేపీ కీలక నేతల దగ్గర రూ.2వేల నోట్లు ఉన్నాయని ఆయన ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దుతో ధనవంతులెవరైనా ఇబ్బందిపడుతున్నట్లు కనబడిందా అని ప్రశ్నించారు.
దేశంలో సామాన్యులు నడిరోడ్డుపై నిలబెట్టేశారనీ, సామాన్యులు తీవ్రమైన కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాల కోసం డబ్బు లేక బ్యాంకులకు వెళితే డబ్బు ఇచ్చేందుకు జరుగుతున్న జాప్యం కారణంగా నరకం కనబడుతోందని అన్నారు. ఇది నరేంద్ర మోదీ సామాన్యులపై చేసిన సర్జికల్ దాడి అంటూ ఆయన ఆరోపించారు.
పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్ల కుబేరులు డాలర్లను బ్లాక్‌లో కొంటున్నారని చెప్పుకొచ్చారు. అసలు నల్లధనం ఎవరి వద్ద ఉందో కేంద్రప్రభుత్వం బహిర్గతం చేయాలనీ, అలా చేయకుండా సామాన్యులను బాధపెట్టడం ఏమిటని ప్రశ్నించారు.