సీబీఎస్ఈ పరీక్షలు రద్దా? నేడు కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోడీ!

బుధవారం, 14 ఏప్రియల్ 2021 (12:23 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. దీంతో వచ్చే నెలలో జరగబోయే సీబీఎస్‌ఈ బోర్డు వార్షిక పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడ నేడు కీలక సమావేశం నిర్వహించనున్నారు. 
 
బుధవారం మధ్యాహ్నం కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌, విద్యాశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయి పరీక్షలపై చర్చించనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నందున మే నెలలో జరగాల్సిన బోర్డు పరీక్షలను రద్దు చేయాలని లేదా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌చేస్తూ ఆన్‌లైన్‌లో నమోదైన పిటిషన్లపై లక్ష మందికిపైగా పది, 12 తరగతుల విద్యార్థులు సంతకం చేశారు. 
 
గతేడాది కరోనా కేసులు తక్కువగా ఉన్నసమయంలో పరీక్షలు వెంటనే రద్దు చేసిన సీబీఎస్‌ఈ.. ఇప్పుడు కేసులు విపరీతంగా పెరుగుతుంటే మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, తీవ్రస్థాయిలో విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. 
 
వీరికి పలువురు రాజకీయ నాయకులు కూడా మద్దతుగా నిలిచారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పరీక్షల నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు కేంద్రాన్ని కోరారు. 
 
అయితే సీబీఎస్‌ఈ బోర్డు మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపడం గమనార్హం. పరీక్షల సమయంలో కొవిడ్‌-19 మార్గదర్శకాలు అన్నింటినీ ఖచ్చితంగా పాటిస్తామని, విద్యార్థుల భద్రతకు అవసరమైన అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ఇటీవల ప్రకటించింది. సీబీఎస్‌ఈ 10,12వ తరగతి పరీక్షలు మే 4 నుంచి ప్రారంభం కానున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు