ప్రవాస భారతీయుల కోసం కేంద్రం ప్రయత్నాలు!

బుధవారం, 29 ఏప్రియల్ 2020 (16:20 IST)
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. మే 3వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌కు కొన్ని సడలింపులు ఇచ్చి విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 
 
విదేశాల్లో చిక్కుకుపోయిన వారి కుటుంబసభ్యలు తమ వారిని స్వదేశానికి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రవాసీలను తీసుకురావడానికి ప్రత్యేకంగా విమానాలు పంపాలని కేంద్రం నిర్ణ‌యించింది.

ఇందుకు గాను చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఎంత మంది విదేశాల్లో చిక్కుకున్నారు, ఎంత మందిని తిరిగి దేశానికి రానున్నారు అన్నవివరాలను సేకరించాలని భారత రాయబార కార్యాలయాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. విదేశాల్లో చిక్కుకుని ఉన్నవారి పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తోంది. ఆయా దేశాల భారత రాయభార కార్యాలయ సిబ్బంధి వివరాలను సేకరిస్తున్నారు.

ఇప్పటికే ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం, అలాగే ఖతర్‌లోని రాయబార కార్యాలయం కూడా ఆన్‌లైన్‌లో వివరాలను సేకరిస్తున్నారు. కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తచెందుతుండడంతో కేంద్రం ప్రభుత్వం గత నెల 22వ తేదీన అంతర్జాతీయ విమాన సర్వీసులను నిలిపివేసింది. 
 
విద్య, ఉద్యోగ, ఉపాధి, పర్యాటకానికి వివిధ దేశాలకు వెళ్లిన ఎంతో మంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారంతా తిరిగి భారత దేశానికి చేరుకోలేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు