18 ఏళ్ల లోపు పెళ్లి.. అలాగైతే ఓకే...

సోమవారం, 20 సెప్టెంబరు 2021 (18:15 IST)
18 ఏళ్ల లోపు మహిళ అభ్యంతరం వ్యక్తం చేయకపోతే.. పెళ్లి రద్దు చేయాలని కోర్టును కోరనట్లైతే.. ఆ వివాహం చెల్లుతుందని పంజాబ్‌, హర్యానా హైకోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ వివాహాన్ని రద్దు చేయడం కుదరదని, దంపతులు విడిపోవాలని కోరుకుంటే కోర్టు ద్వారా విడాకులు పొందవచ్చని జస్టిస్ రీతూ బహ్రీ, జస్టిస్ అరుణ్ మోంగాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
 
దేశంలో బాలికల పెండ్లికి చట్టబద్ధమైన అర్హత వయసు 18 ఏండ్లు. కాగా, 17 ఏండ్ల ఆరు నెలల 8 రోజుల వయసున్న బాలికకు 2019లో ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వారికి ఒకరు సంతానం. అయితే తమ పెండ్లిని రద్దు చేయాలని కోరుతూ ఆ దంపతులు 2020 జూన్‌ 22న లుధియానా ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. 
 
మైనర్‌గా ఉన్నపుడు బాలిక సమ్మతితో జరిగిన పెండ్లి కావడంతో హిందూ వివాహ చట్టం ప్రకారం ఆ పెండ్లికి విలువ, గుర్తింపు లేదని, దీంతో ఆ పెండ్లిని రద్దు చేయలేమని కోర్టు తెలిపింది. ఈ నేపథ్యంలో వారికి విడాకులు మంజూరు చేయలేమంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.
 
దీంతో ఆ దంపతులు పంజాబ్‌, హర్యానా హైకోర్టును ఆశ్రయించగా దిసభ్య ధర్మాసనం వారి పిటిషన్‌పై విచారణ జరిపింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 13(2) (iv) ప్రకారం అమ్మాయికి 15 సంవత్సరాల వయస్సులో వివాహం జరిగినప్పుడు మాత్రమే పెండ్లి శూన్యత లేదా రద్దు కోసం 18 ఏండ్లు నిండకముందే ఆమె పిటిషన్ దాఖలు చేయవచ్చని కోర్టు పేర్కొంది. ఈ కేసులో ఆ బాలికకు 17 ఏండ్లు నిండిన తర్వాత ఆమె సమ్మతితో జరిగిన పెండ్లిగా కోర్టు నిర్ధారించింది.
 
ఆమె అన్ని ఉద్దేశ్యాలు, ప్రయోజనాల కోసం 18 ఏండ్ల లోపు పెండ్లి శూన్యత కోసం ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయకపోవడాన్ని హైకోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆ వివాహం చెల్లుతుందని పేర్కొంది. ఆ వివాహాన్ని రద్దు చేయడం కుదరదని తెలిపింది. అయితే భర్త నుంచి విడిపోయేందుకు ఆమె విడాకులు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు