దేశంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇదివరకెన్నడూ లేనంతగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గురువారం ఒక్కరోజే భారత్‌లో 12,881 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 24గంటల వ్యవధిలో మరో 334 మంది చనిపోయారు.
ఇప్పటి వరకూ భారత్‌లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 3,66,946కు చేరింది. ప్రస్తుతం 1,60,384 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం వరకు 1,94,325 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 12,237కు పెరిగింది.
అలాగే దేశంలో గడచిన 17రోజుల్లోనే కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య రెట్టింపు అయిందని లెక్కలు చెబుతున్నాయి. మే 31 వరకు దేశంలో 1, 82, 000 పాజిటివ్ కేసులు, 5, 164 మరణాలు నమోదయ్యాయి. అంటే జనవరి నుండి మే 31 దాకా నమోదయిన కరోనా కేసులు ఎన్నో, మే 31 నుండి జూన్ 17 దాకా అన్ని కేసులు నమోదయ్యాయి.
జూన్ 17నాటికి కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా దాదాపు రెట్టింపు అయ్యాయి. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజు వారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్, భారత్ లలో నిత్యం పదివేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.