రెడ్ సిగ్నల్ పడితే ఆగాలన్న కనీస జ్ఞానం మనుషులకు లేదు. కానీ, నోరులేని మూగ జీవులకు ఉంది. పలు సందర్భాల్లో మూగ జీవులు రోడ్డును దాటుకునే సమయంలో వాహన రాకపోకలను గమనిస్తూ దాటుతాయి. తాజాగా ఓ గోమాత... రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. అపుడు రెడ్ సిగ్నల్ పడగానే ఆ గోవు రోడ్డుపై ఆగి, గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తూ నిలబడిపోయింది. ఈ ఆశ్చర్యకర సంఘటన మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
ఓ ట్రాఫిక్ కూడలి వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో ఆవు ఆగిపోయింది. తెల్లగీతను దాటకుండా నిలబడింది. వెనుక హారన్లు మోగుతున్నా అది పట్టించుకోలేదు. ఇతర వాహనదారులవలెనే అది గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూసింది. సిగ్నల్ మారగానే ముందుకు కదిలింది. ఈ వీడియోను షేర్ చేసిన పూణె పోలీసులు వాహనదారులకు కీలక సూచనలు కూడా చేశారు. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆవు లాగా ఆగిపోండి అంటూ సరదా కామెంట్ చేశారు.
మరోవైపు, వీడియోకు జనాల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తాము ఇలాంటి ఘటన ఎక్కడా చూడలేదని అనేక మంది వ్యాఖ్యానించారు. వాహనదారులకంటే ఆవుకే నిబద్ధత ఎక్కువని కొందరు కీర్తించారు. కొందరు మాత్రం పూణె పోలీసులపై కీలక ప్రశ్నలు సంధించారు. ఆవులు, ఇతర జంతువులు రహదారుల్లో ఇలా తిరగడం వాహనదారులకు ప్రమాదకరం కాదా అని ప్రశ్నించారు. ఆవు యజమానిది బాధ్యతారాహిత్యమని కొందరు విమర్శించారు. జంతువులను ఇలా రహదారులపై వదలడం వాటికి కూడా ప్రమాదమేనని పేర్కొన్నారు.