శబరిమల సన్నిధానం, పంబ పరిసర ప్రాంతాల్లో ఉన్న భక్తులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటవీ మార్గం మీదుగా భక్తుల రాకపోకలు నిషేధించారు. చెట్ల కింద, పల్లపు ప్రాంతాల్లో బస చేయవద్దని భక్తులకు సూచించారు.
ఇకపోతే.. ఒఖీ అనే పేరుపెట్టుకున్న ఈ తుఫాను కారణంగా 24 గంటల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. శబరిమల వెళ్ళే భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. డిసెంబర్ 5 నాటికి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ఈ వాయుగుండం ప్రవేశిస్తుందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
మరోవైపు భారీ తుఫాను వల్ల కన్యకుమారి విలవిలలాడుతోంది. భారీగా ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వాధికారులు తెలిపారు. ఓఖీ తుఫాను ప్రభావంతో కన్యాకుమారిలో 985 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దాదాపు రెండు వేల వృక్షాలు నేలకొరిగాయి. ఓఖీ ప్రభావం తమిళనాడుపై అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ 8 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది.