ప్రియుడి కోసం... భర్తకు బలవంతంగా మద్యం తాగించిన భార్య.. రోకటి బండతో మోది హత్య
శుక్రవారం, 20 జనవరి 2017 (11:45 IST)
ప్రియుడి ప్రేమ ముందు... అగ్నిసాక్షిగా చేసుకున్న పెళ్లిబంధం చిన్నబోయింది. ఫలితంగా ప్రియుడు ఇచ్చే పడకసుఖం కోసం భర్తనే కడతేర్చిందో మహిళ. అదీ కూడా భర్తకు మద్యం తాగించి, పచ్చడి బండతో తలపై మోది... హత్య చేసింది. ఈ దారుణం కృష్ణా జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
విజయవాడ అజిత్ సింగ్ నగర్ పైపులైన్ల రోడ్డుకు చెందిన నిల్లా దుర్గాప్రసాద్ (37) అనే వ్యక్తి బంగారు వ్యాపారి. ఈయనకు తొమ్మిదేళ్ళ క్రితం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మల్లికతో వివాహం జరిగింది. పై అంతస్తులో కాపురం.. కింద వ్యాపారం చేసుకుంటూ దుర్గా ప్రసాద్ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు.
ఈ పరిస్థితుల్లో దుర్గాప్రసాద్ వద్ద అజిత్ సింగ్ నగర్ వాంబే కాలనీకి చెందిన మజ్జి సింహాచలం 13 ఏళ్లుగా పనిచేయడంతో ఇంట్లో మనిషిలా ఉండేవాడు. ఈ నేపథ్యంలో మల్లికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దుర్గాప్రసాద్ బయటకు వెళ్లిన సమయంలో సింహాచలం పైఅంతస్తులోకి వెళ్లి మల్లికతో రాసలీలలు కొనసాగిస్తూ వచ్చాడు. దీన్ని గమనించిన పిల్లలు తండ్రికి విషయం చెప్పారు.
దీంతో అనుమానం పెంచుకున్న ఆయన పై అంతస్తులోకి వెళ్లే మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాడు. సీసీ కెమెరాల్లో దృశ్యాలను చూసిన దుర్గాప్రసాద్, భార్య మల్లికపై చేయి చేసుకున్నాడు. దీన్ని పెద్ద వివాదం చేసిన ఆమె పిల్లలను తీసుకుని భీమవరం పుట్టింటికి వెళ్లిపోయింది. కుమారుడిని తల్లిదండ్రుల వద్ద వదిలేసి విజయవాడ వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు కుమార్తెను తన మావయ్యకు ఇచ్చేసి తనపై నిఘా లేకుండా చేసుకుంది.
ఈ క్రమంలో ప్రియుడిని వదిలి ఉండలేని మల్లిక.. భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించింది. ఇదే విషయంపై ప్రియుడు సింహాచలంతో చర్చించింది. ముందుగా కిరాయి రౌడీలను పురమాయించి చంపించాలనుకున్నారు. అది కుదరకపోవడంతో తామే ఆ పని చేయాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి దుర్గాప్రసాద్‌కు మద్యం తాగే అలవాటు లేదు. నవంబర్ 15న భర్త దుర్గాప్రసాద్‌కు ఆమె బలవంతంగా మద్యం తాగించింది. అతడు మత్తులోకి జారుకున్న తర్వాత సింహాచలం ఇంటికి వచ్చాడు.
అప్పటికే కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకున్న పచ్చడి బండతో దుర్గాప్రసాద్‌ను తలపై బలంగా కొట్టారు. అర్థరాత్రి సమయంలో మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి గుణదలలోని రైల్వే ట్రాక్ పక్కన పడేశారు. తన భర్త కనిపించడం లేదని మల్లిక 17న పోలీసులకు ఫిర్యాదు చేసింది. రైల్వే పోలీసులు గుర్తుతెలియని మృతదేహంగా గుర్తించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ మర్నాడు ఈ మృతదేహం తన భర్తదేనని మల్లిక ఆస్పత్రికి వెళ్లింది.
దుర్గాప్రసాద్ తల్లిదండ్రులు అతడి మృతిపై ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయకపోవడంతో గండం తప్పినట్టేనని మల్లిక భావించింది. తలపై బలమైన గాయం కావడం వల్లే దుర్గాప్రసాద్ చనిపోయాడని ఫోరెన్సిక్ వైద్యులు నివేదికలో పేర్కొనడంతో పోలీసుల అనుమానం మల్లికపైకి మళ్లింది. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి ఒక నిర్ధారణకు వచ్చారు. అలాగే ఫిర్యాదులో వయస్సును తప్పుగా పేర్కొనడంతో ఆ అనుమానం బలపడింది. ఖాకీ తరహాలో విచారించే సరికి మల్లిక అల్లిన కథలు తప్పని తేలింది. ఆమెతోపాటు ప్రియుడు సింహాచలాన్ని అజితసింగ్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు.