లాక్డౌన్ కష్టాల్లో చిక్కుకున్న యువతిపై గ్యాంగ్ రేప్

మంగళవారం, 16 జూన్ 2020 (12:54 IST)
లాక్డౌన్ కష్టాల్లో చిక్కుకున్న 16 యేళ్ళ యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోవడంతో ఆమె తన సొంతూరికి వెళ్లేందుకు ప్రయత్నాలుచేపట్టింది. ఈ విషయం తెలిసుకున్న ముగ్గురు యువకులు.. తాము రైలు ఎక్కిస్తామని నమ్మబలికి ఆ యువతిని తమ వెంట తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ యువతి ఢిల్లీకి వలస వచ్చి ఓ ఇంట్లో పని చేస్తూ జీవిస్తోంది. అయితే, లాక్డౌన్ కారణంగా ఆ యువతి ఉపాధి కోల్పోయింది. దీంతో సొంతూరుకు వెళ్లేందుకు ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ నుంచి న్యూఢిల్లీ రైల్వేస్టేషనుకు చేరుకుంది. 
 
ఆ స్టేషన్‌లో ఉన్న ముగ్గురు యువకులు... జార్ఖండ్ వెళ్లేందుకు రైలు ఎక్కిస్తామని మాయమాటలు చెప్పి... తమతో బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆ బాలికకు మద్యంతాగించారు. అనంతరం బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసి, రోడ్డుపై వదిలివేసి పారిపోయారు.
 
ఆ  బాలిక అనుమానాస్పదంగా మత్తులో జోగుతూ నడుస్తుండగా ఓ పోలీసు కానిస్టేబుల్ గమనించి ఆమెను పోలీసుస్టేషనుకు తీసుకువచ్చారు. మహిళా పోలీసులు ప్రశ్నించగా బాలిక సామూహిక అత్యాచారం గురించి చెప్పింది. దీంతో బాలికకు వైద్యపరీక్షలు చేయించి ఆమెను ఛైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు