ముఖ్యమంత్రి అయితే అరెస్టు చేయకూడదా? ఢిల్లీ కోర్టు ప్రశ్న :: సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్

వరుణ్

బుధవారం, 10 ఏప్రియల్ 2024 (10:40 IST)
ముఖ్యమంత్రి అయినంతమాత్రాన అరెస్టు చేయకూడదన్న చట్టం ఉందా అంటూ ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అక్రమం కాదంటూ కేజ్రీవాల్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. దీనిపై ఆప్ స్పందించింది. కోర్టుపై గౌరవం ఉందంటూనే తీర్పును అంగీకరించలేమని పేర్కొంది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆప్ సవాల్ చేసింది.
 
లిక్కర్ పాలసీలో తన అరెస్టు అక్రమమని, నిబంధనల ఉల్లంఘనే ఉంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, తనను వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఇవే అంశాలతో ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన కోర్టు.. కేజ్రీవాల్ అరెస్టుతో ఎలాంటి అతిక్రమణలు జరగలేదని తేల్చిచెప్పింది. ఆధారాలు ఉన్నాయంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన వాదలతో కోర్టు ఏకీభవించి, అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు సక్రమమేనంటూ వ్యాఖ్యానిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. 
 
ఢిల్లీ హైకోర్టు తీర్పుపై ఆ పార్టీ నేతలు స్పందించారు. ఢిల్లీ హైకోర్టుపై తమకు గౌరవం ఉందని, అయితే, తాజా తీర్పును మాత్రం ఆమోదించబోమని చెప్పారు. హైకోర్టులో చుక్కెదురు కావడంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ మేరకు కేజ్రీవాల్ న్యాయవాదులు సుప్రీంకోర్టు తలపుతట్టారు. ఇదే కేసులో తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించిన విషయాన్ని గుర్తుచేస్తూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కి కూడా సుప్రీంకోర్టులో ఊరట లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు