కేంద్రం తీసుకొచ్చిన కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రిపబ్లిక్ డే రోజున రైతులు ఢిల్లీలో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. రైతుల ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకున్న భద్రతా బలగాలపై దాడులకు దిగారు. ముఖ్యంగా, అనుమతి లేని ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన కొందరు ఆందోళనకారులు.. ఎర్రకోటపై జాతీయ జెండాతో పాటు మతపరమైన జెండాను ఎగురవేశారు. ఈ ఘటన కలకలం రేపుతోంది.
ఇదిలావుంటే, కేంద్రం ఆదేశాల మేరకు ఈ అల్లర్లపై ఢిల్లీ పోలీసులు సైతం దర్యాప్తును వేగవంతం చేశారు. రైతుల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రాకేశ్ తికాయత్, యోగేంద్ర యాదవ్, గుర్నాం సింగ్, దర్శన్ పాల్ సహా పలువురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు, లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. అలాగే, పాస్‌పోర్టులను సరెండర్ చేయాలని ఆదేశించారు.