స్వరోష్ కోహ్లీ కొన్నేళ్ల క్రితం తన భర్త మరణించడంతో ఇంట్లో ప్రస్తుతం ఒక్కరే ఉంటున్నారు. ఇటీవలే ఢిల్లీ పోలీస్ సీనియర్ సిటిజన్ సెల్‌లో తన పేరు రిజిస్టర్ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో బెడ్ బాక్సును తెరుస్తూ గురువారం తూలి అందులో పడిపోయారు. అలకనందలో నివసిస్తున్న ఆమె మనవరాలు నాన్సీ కోహ్లీ తన మొబైల్ ఫోన్‌లో సీసీటీవీ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు.
సాయం కోరుతూ వెంటనే ప్రసాద్ నగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి వెళ్లి ఆమెను కాపాడినట్టు డీసీపీ భాటియా వెల్లడించారు. వృద్ధాప్యం, బలహీనత కారణంగా ఆమె బెడ్‌బాక్సులోనే పది నిమిషాల పాటు ఉండిపోయారని.. వెంటనే కాపాడామని డీసీపీ పేర్కొన్నారు. కాగా పోలీసులు వెళ్లిన కొద్ది సేపటికి అక్కడికి చేరుకున్న నాన్సీ కోహ్లీ, ఆమె భర్త ఢిల్లీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.