దేశంలో రద్దు చేసిన స్థాయిలోనే కొత్త నోట్లను సిద్ధం చేయలేక పోయామని, ఈ విషయంలో దేశ ప్రజలు క్షమించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అదేసమయంలో రెండు మూడు నెలల్లోనే దేశ ఆర్థిక వ్యవస్థలో బూమ్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
ప్రస్తుతం పెద్ద నోట్ల రద్దుతో దేశ వ్యాప్తంగా నెలకొన్న గందరగోళ పరిస్థితులసపై ఆయన మాట్లాడుతూ... మరో మూడు నెలల్లో అంతా సర్దుకుంటుందని, కాబట్టి, పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇచ్చారు.
మరోవైపు... నోట్ల రద్దు కారణంగా పాత నోట్లు చెల్లక, ఇటు బ్యాంకులు తెరుచుకోక.. అటు ఏటీఎంలు వట్టిపోయి.. దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన మొదటి ఆదివారంనాడు బ్యాంకులు పనిచేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారుగానీ.. రెండు ఆదివారం వారికి ఆ వెసులుబాటు లభించకపోవడంతో నానా ఇక్కట్లు పడ్డారు.