దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన సంచలన ప్రకటన ప్రపంచ దేశాలను సైతం ఓ కుదుపు కుదుపుతోంది. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడితో డాలర్ విలువ గంట గంటకూ మారుతుండగా.. ఇదే సమయంలో రూ.1000, రూ.500 నోట్ల రద్దు ప్రకటన కోట్లామందిని షాక్కు గురి చేసింది.
ప్రధానంగా భారతీయ నల్లధనానికి ప్రధాన మూలంగా ఉన్న బంగారం మొత్తం.. గల్ఫ్ దేశాల నుంచే వస్తుండగా వారికి కూడా ఈ ప్రకటన పిడుగుపాటుగా మారింది. ఇక గల్ఫ్ దేశాలన్నింటిలోనూ అధికారికంగా మనీ ఎక్స్చేంజీలు ఉండగా.. అందులో స్థానిక కరెన్సీతోపాటు డాలర్, యూరో, భారతీయ నోట్లను అత్యధికంగా విక్రయిస్తుంటారు. ఆయా కరెన్సీల నగదు కట్టలను వీరు తమవద్ద నిల్వ ఉంచుకొంటారు.
భారత నుంచి నోట్లను పంపించడంపై నిషేధమున్నా విదేశాల్లో కావల్సినంత భారతీయ కరెన్సీ లభ్యమవుతుంది. గల్ఫ్ దేశాల నుంచి నకిలీ నోట్లను కూడా భారత్కు పంపించిన సంఘటనలున్నాయి. అయితే భారత ప్రభుత్వ సంచలన నిర్ణయంతో మనీ ఎక్స్చేంజీల వద్ద నిల్వ ఉన్న భారతీయ కరెన్సీ పూర్తిగా వృధా అయిపోనుంది, అధికారికంగా వీరు మార్పిడి చేసుకొనే అవకాశం ఉండదు. మొత్తమీద మోడీ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి.