ప్రస్తుత సమాజంలో మానవత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. మనిషి ప్రాణాలు పోతున్నా… సాటి మనుషులు కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా కళ్లెదుటే పలువురు తిరిగిరానిలోకాలకు చేరుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే ఒకటి బీహార్ రాష్ట్రంలో జరిగింది. అదీ కూడా ఆ రాష్ట్ర రాజధాని పాట్నాలోని అత్యున్నత వైద్య సంస్థ ఎయిమ్స్ ఆసుపత్రిలో ఈ దారుణం జరిగింది.
ఈ వివరాల్లోకి వెళితే… లక్షిసరై జిల్లా కజ్రా గ్రామానికి చెందిన రామ్ బాలక్ దంపతుల కుమార్తె రౌషణ్ కుమారి ఆరు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో మంగళవారం ఎయిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడి సిబ్బంది తొలుత ఔట్ పేషంట్(ఓపీ)కార్డు తేవాలని చెప్పారు. నిరుపేద కూలి అయిన రామ్ బాలక్ ఓపీ కార్డు కోసం యత్నిస్తుండగా.. కుమార్తె విషమిమించింది.
దీంతో ఆ తల్లిదండ్రులు కుమార్తె శవంముందు కూలబడిపోయి బోరున విలవించారు. ఆ తర్వాత చేసేదేం లేక కుమార్తె శవాన్ని ఇంటికి తీసుకువెళ్లడానికి అంబులెన్స్ సమకూర్చాలని కోరారు. అయినా.. ఆస్పత్రి సిబ్బందికి మనసొప్పలేదు. దీంతో చేసేది లేక.. తానే భుజంపై వేసుకుని… 4 కిమీ.లు నడిచి ఇంటికి తీసుకెళ్లి, అంత్యక్రియలు పూర్తి చేశారు ఆ తల్లిదండ్రులు. ఈ ఘటనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించక పోవడం గమనార్హం.