తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలో ఓ విచిత్ర సంఘటన ఒకటి జరిగింది. తనకు ఓ కేజీ మటన్ ఉచితంగా ఇవ్వాలని ఓ వ్యాపారిని ఓ వ్యక్తి అడిగాడు. దీనికి ఆ వ్యాపారి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి శ్మశానానికి వెళ్లి పాతిపెట్టిన ఓ మృతదేహాన్ని తవ్వి తీసుకుని మటన్ దుకాణం వద్దకు వచ్చాడు. మృతదేహాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు.
తేని జిల్లాలోని పళనిశెట్టి ప్రాంతానికి చెందిన మణియరసన్ అనే వ్యక్తి ఈ మటన్ దుకాణాన్ని నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన కుమార్ అనే వ్యక్తి జులాయ్‌గా తిరుగుతూ ఉంటాడు. ఈ క్రమంలో మణియరసన్ వద్దకు వెళ్లి ఉచితంగా మటన్ ఇవ్వాలని అడగ్గా వ్యాపారి నిరాకరించాడు. తాను అడిగిన డబ్బులు, మటన్ ఇవ్వకుంటే మలవిసర్జన కలిపిన నీటిని దుకాణంలో పోస్తానని హెచ్చరించాడు. దీంతో భయపడిపోయిన వ్యాపారి... ఓ కేజీ పేగులు ఇచ్చాడు. మటన్, డబ్బులు అడిగితే పేగులు ఇస్తావా అంటూ వ్యాపారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
కొంతసేపటి తర్వాత శ్మశానంలో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి భుజాన వేసుకుని వీధుల్లో నడుచుకుంటూ మటన్ దుకాణం వద్దకు వచ్చాడు. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారంతో ఆగమేఘాలపై అక్కడకు చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తిరిగి శ్మశానంలో పాతిపెట్టారు. దీనిపై పళనిశెట్టి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది.