కరోనా కేసుల సంఖ్యను దాచవద్దు: కేంద్రం

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (05:31 IST)
దేశ వ్యాప్తంగా కరోనా నియంత్రణ కు లాక్ డౌన్ నిబంధనలను మే 3 వరకూ కట్టుదిట్టంగా అమలు చేయాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాలను ఆదేశించారు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై ఆదివారం ఢిల్లీ నుండి ఆయన వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేబినెట్ కార్యదర్శి మాట్లాడుతూ.. ఏరాష్ట్రంలోను కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపడం లేదా దాచిపెట్టడం వంటి ప్రయత్నాలు చేయొద్దని స్పష్టం చేశారు.

కొన్ని రాష్ట్రాల్లో టెస్టులు ఎక్కువగా చేయడం వల్ల కేసుల సంఖ్య పెరగవచ్చని దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ లాక్ డౌన్ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో దేశవ్యాప్తంగా మంచి మెరుగుదల కనిపిస్తోందని ఇదే స్పూర్తిని మరికొన్ని రోజులు పాటించ గలిగితే కరోనాపై పోరాటంలో విజయం సాధించ గలుగుతామని పేర్కొన్నారు.

ముఖ్యంగా రెడ్ జోన్లు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అందుబాటులో ఉన్న అన్ని సదుపాయాలను పూర్తిగా వినియోగించు కోవాలని అయిన  చెప్పారు.ఇప్పటి వరుకూ దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదు కాకుండా ఆయా జిల్లాల్లో అక్కడక్కడ కేసులు నమోదు అవుతున్న నేపధ్యంలో ఆయా జిల్లాల్లో కూడా లాక్ డౌన్ నిబంధనలను ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ స్పష్టం చేశారు.
 
రంజాన్ తదితర పర్వదినాలను పురస్కరించుకుని అధిక సంఖ్యలో ప్రజలు ఒక చోట గుమికూడ కుండా ఎవరి ఇళ్ళలో వారు ఆలాంటి వేడుకలను జరుపుకోవాలని ఆయన హితవు చేశారు. ఈవిషయమై ఆయా మతపెద్దలతో రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడి తగిన సూచనలు ఇవ్వాలని చెప్పారు.
 
రేషన్ దుకాణాలు, నిత్యావసర సరుకులు తీసుకునే చోట లేదా రైతు బజారులు,ఎటిఎంలు, బ్యాంకులు వంటి ప్రతి చోటా ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని పాటించేలా ప్రజలందరిలో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ లను కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆదేశించారు.
 
ఈవీడియో సమావేశంలో  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని మాట్లాడుతూ కొవిడ్ పరీక్షలు అధిక సంఖ్యలో నిర్వహించడం జరుగుతోందని వివరించారు. ప్రస్తుతం ఏంటిజెన్ టెస్టులకు ఆర్టిపిసిఆర్,ట్రూనాట్ పరికరాలు ద్వారా రోజుకు ఎనిమిది వేల మందికి పరీక్షలు చేస్తున్నామని ఈసంఖ్యను పది వేలకు తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తునట్టు సిఎస్ నీలం సాహ్ని వివరించారు.

దక్షిణ కొరియా నుండి దిగుమతి చేసుకున్న కిట్లతో పెద్ద ఎత్తున టెస్టులు చేస్తున్నట్టు చెప్పారు. ఇంకా ఎవరెవరికి ఎక్కడెక్కడ టెస్టులు నిర్వహించాలనే దానిపై మరిన్ని స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని సిఎస్ నీలం సాహ్ని కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబను కోరారు.
 
ఈ వీడియో సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్,ఐజి వినీత్ బ్రిజ్లాల్, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్ పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు