ఆ బామ్మ 78 ఏళ్ల వయస్సులో రోజూ రెండు కేజీల ఇసుక తింటుందట. ఇంకా అదే ఆమె ఫిట్‌నెస్ రహస్యమని చెప్తోంది. వారణాసికి చెందిన కుసుమావతి అనే మహిళ తాను 15 ఏళ్ల నాటి నుంచి ఇసుక తినడం ప్రారంభించానని చెప్పింది. రోజూ రెండు కేజీల ఇసుక తింటానని.. ఇప్పటికీ తింటూనే జీవితాన్ని గడుపుతున్నట్లు చెప్పింది. ఇసుకను తింటుండడం వల్లే తాను ఇప్పటికీ ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉన్నానని చెబుతోంది.
ఇలా తినడం వల్ల తన కడుపులో కానీ, నోట్లో కానీ ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని ఆ బామ్మ చెప్పింది. తన దంతాలతో ఈ వయసులోనూ గట్టి రాళ్లను ఎంతో సులువుగా కొరికేస్తానని తెలిపింది. ఇసుక తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులు ఉండబోవని చెబుతోంది. ఆమె ప్రతిరోజు ఎంతో ఉత్సాహంగా వ్యవసాయ కూలీ పనికి కూడా వెళుతుంది.
వారణాసికి చెందిన ఈ బామ్మ 63 ఏళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి రోజు ఇసుక తింటున్న వైనంపై మీడియాకు పలు వివరాలు చెప్పింది. ఇసుక తినడం ప్రారంభించినప్పుడు మొదట్లో పొట్ట నొప్పి ఎంతో బాధించిందని.. ఆపై మెల్లగా తగ్గిపోయిందని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ రోజులో కొంత సమయాన్ని కేటాయించి తానే స్వయంగా ఇసుక సేకరించుకుంటోంది. ఇసుక దొరక్కపోతే ఇంటి గోడ పగలగొట్టి అదే తినేస్తుందట. ఇదంతా రోజూ గమనిస్తున్న స్థానికులు ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు.