ఇటీవల కేంద్ర ప్రభుత్వం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చింది. ఈ చట్టాల వల్ల రైతులకు తీవ్ర హాని కలుగుతుందని, కార్పొరేట్ శక్తులు మేలు చేకూర్చేలా ఈ చట్టాన్ని తెచ్చిందని ఆరోపిస్తూ దేశంలోని పలు రైతుల సంఘాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే హస్తిన వేదికగా ప్రకంపనలు సృష్టించిన రైతు సంఘాలు ఇపుడు తమ తదుపరి కార్యాచరణను ప్రకటించాయి.
ఇందులోభాగంగా, ఈ నెల 26న పూర్తి స్థాయి భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. వ్యవసాయ చట్టాలపై తాము చేస్తున్న ఆందోళన ఆ తేదీకి నాలుగు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో భారత్ బంద్ నిర్వహించాలని నిర్ణయించినట్లు రైతు నేత బూటా సింగ్ తెలిపారు.
ఈ బంద్ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టంచేశారు. అలాగే పెరిగిన చమురు ధరలు, పబ్లిక్ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న ట్రేడ్ యూనియన్లతో కలిసి ఆందోళనలో పాల్గొనున్నట్లు తెలిపారు. మార్చి 29న హోలీకా దహన్‌పేరిట వ్యవసాయ చట్టాల ప్రతులను దగ్ధం చేస్తామని తెలిపారు.