కేరళ రాష్ట్రంలో మరో ఘోర ప్రమాదం జరిగింది. దీపావళి పండుగ కోసం నిల్వవుంచిన బాణాసంచా పేలి 154 మంది గాయపడ్డారు. నిప్పు రవ్వలు ఎగిసిపడి గదిలో నిల్వచేసిన బాణాసంచాకు నిప్పు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో స్థానికులంతా ప్రాణభయంతో పరుగులు చేశారు. ఈ ఘటనలో 154 మంది గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ విషాదకర ఘటన కేరళ రాష్ట్రంలోని కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజుతంబళం వీరెర్కవు ఆలయంలో గత అర్థరాత్రి జరిగింది. సంప్రదాయ తెయ్య పండుగ సందర్భంగా 1500 మంది ప్రజలు ఆలయానికి తరలివచ్చారు.
ఈ సందర్భంగా టపాసులు పేల్చిన నిప్పు రవ్వలు బాణాసంచా నిల్వచేసి గదిలోకి వెళ్లాయి. దీంతో మంటలు చెలరేగి ఆ గదిలో నిల్వవుంచిన బాణాసంచా భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో తొక్కిసలాట జరిగింది. గాయపడిన వారిని వివిధ ఆస్పత్రులకు తరలించారు. కాగా, మంగళవారం రాత్రి జరిగే ఉత్సవంతో ఈ ఆలయ వేడుకలు ముగియాల్సి వుండగా ఈ అపశృతి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన ఇద్దరు ఆలయ అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.