తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లా కున్నూరు సమీపంలోని కాట్టేరి కొండ ప్రాంతంలో భారత రక్షణ శాఖకు చెందిన ఎంఐ17 వి5 రకం హెలికాఫ్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన హెలికాఫ్టర్‌లో త్రివిధ దళపతి బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్‌తో పాటు సహా మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో ఏడుగురు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు.
అయితే, ఈ ప్రమాదం జరిగిన హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితిపై మాత్రం స్పష్టత లేదు. అయితే, కొన్ని మీడియా సంస్థలు మాత్రం బిపిన్ రావత్ తీవ్రంగా గాయపడటంతో ఆయన్ను కున్నూరు ఆర్మీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కానీ, వీటిపై ఆర్మీ వర్గాలు మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే, ఆయన భార్య మాత్రం మృతి చెందారు.
ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రివర్గం అత్యవసరంగా ఢిల్లీలో సమావేశమైంది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఈ భేటీ జరుగగా, ప్రమాదంపై కేంద్ర రక్షణ మంత్ర రాజ్‌నాథ్ సింగ్ మంత్రివర్గానికి వివరించారు. అలాగే, ఆయన పార్లమెంట్‌లో కూడా ఓ ప్రకటన చేశాక ఢిల్లీ నుంచి బయలుదేరి నీలగిరి జిల్లా కున్నూరుకు చేరుకోనున్నారు.
మరోవైపు, భారత త్రివిధ దళాధిపతిగా బిపిన్ రావత్ గత 2019 జనవరిలో బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన భారత ఆర్మీ చీఫ్‌గా పని చేశారు. 2019లో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా త్రివిధ ఆర్మీ చీఫ్ పదవిని సృష్టించింది. దీంతో ఆ బాధ్యతలు స్వీకరించిన తొలి అధికారి బిపిన్ రావత్ కావడం గమనార్హం.