లైంగిక ఆరోపణల నేపథ్యంలో మంత్రిపదవిని త్యజించిన బీజేపీ నేత

గురువారం, 16 డిశెంబరు 2021 (11:43 IST)
సాధారణంగా ప్రభుత్వ అధికారులు, రాజకీయ నేతలపై వివిధ రకాలైన ఆరోపణలు రావడం సహజమే. ఇలాంటి ఆరోపణలు వచ్చినపుడు కొందరు రాజకీయ నేతలు తమ పదవులను వదులుకునేందుకు ఆసక్తి చూపరు. కానీ కొందరు నిజాయితీపరునైన నేతలు మాత్రం పదవులను తృణప్రాయంగా భావించి వాటిని త్యజిస్తుంటారు. 
 
తాజాగా గోవాలో భారతీయ జనతా పార్టీకిచెందిన మంత్రి మిలింద్ నాయక్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. ఈయనపై లైంగిక ఆరోపణలు రావడమే ఇందుకు కారణం. ఈయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనీ, ఒక మహిళను లైంగికంగా వేధించారంటూ కాంగ్రెస్ పార్టీ గోవా అధ్యక్షుడు గిరీష్ చోడంకర్ ఆరోపిస్తూ, మిలింద్ నాయక్‌ను మంత్రిపదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. 
 
అలాగే, మంత్రిపై వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ పరిణామాలన్నీ గమనించిన మంత్రి మిలింద్ నాయక్ ఏకంగా తన మంత్రిపదవినే త్యజించారు. ఈ మేరకు గోవా ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ జరపాలన్న ఉద్దేశ్యంతో మంత్రిపదవికి మిలింద్ నాయక రాజీనామా చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు