కరోనా కష్టాల వేళ పెట్రోల్ ధరలు పెంచడమా? రాహుల్ ప్రశ్న

బుధవారం, 6 మే 2020 (14:05 IST)
కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ నానా కష్టాలు పడుతుంటే కేంద్రం మాత్రం గుట్టుచప్పుడు కాకుండా పెట్రోల్ ధరలు పెంచిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడంపై హేయమైన చర్యగా అభివర్ణించారు. కరోనా కష్టాల వేళ పెట్రో ధరలు పెంచడం ఏంటంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 
లాక్‌డౌన్‌తో జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ధరలు తగ్గించేది పోయి పెంచుతారా? అని ప్రశ్నించారు. కేంద్ర నిర్ణయం సరికాదని, వెంటనే వెనక్కు తీసుకోవాలని రాహుల్ కోరారు. 
 
అంతకుముందు కేంద్రం పెట్రోల్, డీజల్ ధరలను రికార్డు స్థాయిలో పెంచింది. లీటరు పెట్రోలుపై రూ.10, లీటరు డీజిల్‌పై రూ.13 మేరకు ఎక్సైజ్ సుంకాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 
 
నిజానికి 2014లో నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సమయంలో పెట్రోలుపై రూ.9.48, డీజిలుపై రూ.3.56 మేరకు పన్నులు ఉండేవి. ఆపై ఎన్డీయే సర్కారు వరుసగా దొడ్డిదారిన పన్నులను పెంచుకుంటూ వచ్చింది. గడచిన మార్చిలో సైతం పెట్రో ఉత్పత్తులపై రూ.3 శాతం సుంకాన్ని విధించింది. తాజా నిర్ణయంతో సుంకాలు పెట్రోలుపై రూ.32.98, డీజిలుపై రూ.31.83కు పెరిగాయి.
 
నిజానికి కరోనా దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. దీంతో పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల్లో పెట్రోల్ ధరలను తగ్గించారు. కానీ, మన దేశంలో మాత్రం ఆ ఫలాలు మాత్రం ప్రజలకు అందకుండా కేంద్రం పన్నుల రూపంలో బాదుతోంది. తగ్గిన ధరల మేరకు పన్నులను పెంచడం ద్వారా ఖజానాకు కోత పడకుండా చూసుకుంటూ వస్తోంది. 
 
ఫలితంగా అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గినా మన దేశంలో మాత్రం వాటి ధరల్లో ఏమాత్రం మార్పు కనిపించలేదు. ఇకపోతే, పెరిగిన సుంకాలతో ప్రజలపై ఎటువంటి అదనపు భారమూ పడబోదని ఈ సందర్భంగా అధికారులు వ్యాఖ్యానించారు. ఇటీవల ధరలు భారీగా తగ్గాయని గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు