పెళ్లి జరుగుతోందన్న ఆనందం ఆవిరైపోయింది. మంగళవాయిద్యాల మధ్య వధువును పెళ్లాడేందుకు గుర్రంపై ఎక్కి ఊరేగింపుగా వెళ్తున్న వరుడు గుండెపోటుతో దానిపైనే ఒరిగిపోయాడు. ఈ హఠత్పరిణామంతో పెళ్లి వేడుక విషాదంగా మారిపోయింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో 27 ఏళ్ల వరుడు గుండెపోటుతో కుప్పకూలి మరణించాడు. శుక్రవారం రాత్రి తన బరాత్‌లో గుర్రంపై కూర్చొని పెళ్లి మండపం వద్దకు ఊరేగింపుగా బయలుదేరాడు. అతను మొదట్లో ఇతర బరాతీలతో కలిసి నృత్యం చేసి ఆ తరువాత గుర్రంపై ఎక్కాడు.
కెమేరా ఫుటేజ్‌లో వరుడు గుర్రంపై కూర్చున్నప్పుడు అస్వస్థతకు గురై ఒరిగిపోతున్నట్లు కనబడ్డాడు. అతడిని పట్టుకునేందుకు పలువురు ప్రయత్నించారు. అంతలోనే అతడు విగతజీవిగా మారాడు. అతన్ని వెంటనే సమీపంలోని వైద్య సదుపాయానికి తరలించారు కానీ చాలా ఆలస్యం అయింది. నృత్యం చేసి అలసిపోయిన తర్వాత అతనికి గుండెపోటు వచ్చిందని వైద్యులు అనుమానిస్తున్నారు. ప్రదీప్ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా మాజీ జిల్లా అధ్యక్షుడు. వరుడు మరణం గురించి విన్న వధువు మూర్ఛపోయిందని సమాచారం.