స్వచ్ఛంద ఆదాయ వెల్లడి పథకం గడువు మరికొద్ది నిమిషాల్లో ముగిసిపోతుందనగా... తన వద్ద రూ.13,680 కోట్ల ఆస్తి ఉందని గుజరాత్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వెల్లడించారు. అయితే ఇప్పుడు ఆయన అదృశ్యం అయ్యారు. మహేష్ షా (67) అదృశ్యం అయిన విషయాన్ని ఆయన చార్టర్డ్ అకౌంటెంట్ తెలిపారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన షా ముంబై, ఇతర నగరాల్లో రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. ఆయన కోసం పోలీసులు ఎన్నిచోట్ల గాలించినా ఇంతవరకు ఫలితం మాత్రం లేదు. అపాజీ అమీన్ అనే సీఏ సంస్థ భాగస్వామి తెహముల్ షెత్నా వద్దకు ఆదాయ వెల్లడి పథకం సమయంలో వెళ్లిన మహేష్.. ఆ పథకం గురించి అడిగారు. సెప్టెంబర్ 30వ తేదీతో ముగిసిపోతుందనగా.. అదేరోజు రాత్రి 11.55 గంటలకు ఆయన అహ్మదాబాద్‌లోని ఆదాయపన్ను శాఖ కార్యాలయానికి వెళ్లి, తన వద్ద రూ.13,680 కోట్ల ఆస్తి ఉందని చెప్పారు.
మరో ఐదు నిమిషాల్లో పథకం గడువు ముగిసిపోయింది. తనకు మనశ్శాంతి కావాలని, అందుకే తాను మొత్తం ఆస్తి వివరాలు చెప్పేస్తానని ఆయన అన్నట్లు సీఏ షెత్నా చెప్పారు. వెల్లడించినదంతా నగదు రూపంలోనే ఉండటం, అది చాలా పెద్దమొత్తం కావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఆ మొత్తాన్ని ఆయన ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లేందుకు కూడా అంగీకరించారు.
దానికి సంబంధించిన రహస్యాలు, ఇతర వివరాలన్నింటినీ అధికారులు ఆయనకు వివరించారు. పథకం నిబంధనల ప్రకారం నవంబర్ 30 నాటికి తొలి వాయిదాలో రూ.1560 కోట్లు చెల్లించాల్సి ఉంది. కానీ, ఆయన ఆ మొత్తం కట్టలేకపోయారు. నవంబర్ 29 నుంచే షా కనిపించడం లేదని సీఏ షెత్నా ఫిర్యాదుచేశారు. దాంతో పోలీసులు, ఐటీ అధికారులు ఆయన ఇళ్లు, కార్యాలయాలన్నింటిలో సోదాలు చేశారు. ఆరోజు రాత్రి 7 గంటల వరకు తనకు ఫోన్లో అందుబాటులో ఉన్నారని, తర్వాత మాత్రం ఆయన ఫోన్ స్విచాఫ్ అయిపోయిందని షెత్నా చెప్పారు.