పుట్టిన నాలుగు రోజులకే నలుగురి చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపిన శిశువు... ఎలా? 1

మంగళవారం, 31 అక్టోబరు 2023 (07:47 IST)
గుజరాత్ రాష్ట్రంలో ఓ నవజాత శిశువు మరో నలుగురు చిన్నారులకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అదీకూడా పుట్టిన నాలుగు రోజులకే అవయవదానం చేసి, దేశంలోనే అత్యంత పిన్న వయసు గల అవయవ దాతగా నిలిచాడు. నాలుగు రోజుల క్రితం జన్మించిన మగ శిశువు నుంచి సేకరించిన అవయవాలను మరో నలుగురు చిన్నారులకు అమర్చి వారికి ప్రాణదానం చేసినట్టు జీవన్ దీప్ అవయవదాన ఫౌండేషన్ తెలిపింది. 
 
గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో ఉండే అనూప్ ఠాకూర్ భార్య వందనకు అక్టోబరు 23వ తేదీ సాయంత్రం ప్రసవం జరిగింది. అయితే, నవజాత శిశువు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు వైద్యులు గుర్తించారు. దీంతో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత న్యూరో సర్జన్‌కు సిఫార్సు చేశారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స అందించగా, బ్రెయిన్ డెడ్ అయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
దీంతో జీవన్‌దీప్ అవయవదాన  ఫౌండేషన్ ట్రస్టీ విపుల్ తలావియా ఆస్పత్రికి చేరుకుని చిన్నారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పించారు. ఆ తర్వాత ఫౌండేషన్ సభ్యులు చిన్నారి జన్మించిన సుమారు 100 గంటల తర్వాత అతడి  రెండు కిడ్నీలు, కళ్లు, కాలేయాన్ని సేకరించిన వైద్యులు మరో నలుగురు చిన్నారులకు అమర్చి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు