మెమద్‌పూర్ గ్రామానికి చెందిన మహేష్ పార్మార్ అనే యువకుడికి మీసాలు పెంచడమంటే ఇష్టం. అయితే అదే తన కుటుంబంపై దాడికి కారణమవుతుందని అతడు ఊహించలేదు. ఈ నెల 12న అలవాటు ప్రకారం ఓ రోజు రోడ్డుపక్కన హోటల్ వద్ద నిలబడి మహేష్ మీసాలు తిప్పుతున్నాడు. అతని ఎదురుగా నిలబడిన దర్బార్ వర్గానికి చెందిన వ్యక్తులు ఇది సహించలేకపోయారు.
కొందరు వ్యక్తులు మహేష్ వద్దకు వెళ్లి... నీది ఏ కులం... నువ్వు మీసాలు ఎందుకు తిప్పుతున్నావని ప్రశ్నించారు. తాను పార్మార్ కులస్తుడనని చెప్పగానే వారు మహేశ్‌ని తిడుతూ కొట్టడం మొదలుపెట్టారు. తర్వాత పెద్దల సలహా మేరకు తన తమ్ముడు దర్బార్ వర్గీయులతో రాజీ చేసుకున్నాడు. అయినప్పటికీ.. కోపం చల్లారని దర్బార్ వర్గీయులు మహేష్ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. తమను వదిలిపెట్టాలని ప్రాధేయపడినా కులం పేరుతో తిడుతూ చితక్కొట్టారు.