స్నేహితుడంటే ఎవరనుకుంటున్నారు...?(ఆదివారం స్నేహితుల దినోత్సవం)

శనివారం, 6 ఆగస్టు 2016 (22:16 IST)
అమ్మ అనే పదం తర్వాత ఆత్మీయతను ధ్వనింపజేసే ఏకైక పదం స్నేహం. స్నేహం అనేది  ఆ దేవుడిచ్చిన గొప్ప వరం. అమ్మా, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లెలు, అన్న మొదలైన బంధాలను ఆ దేవుడే సృష్టించి ఇచ్చినా స్నేహితులను మాత్రం మనల్నే ఎంచుకోమన్నాడు. అందుకే మంచి స్నేహాన్ని సంపాదించుకుని భద్రంగా కాపాడుకుంటే అది మన జీవితాన్ని సంతోషంగా ఉంచుతుంది. తెలుగు కవి ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి "సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ" అన్నారు. మంచి స్నేహాన్ని సంపాదించుకోవడం అంత సులభం కాదు.
 
స్నేహం అనేది ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటూ దానికి ఒక నిర్ధిష్టమైన లెక్కలు, అంచనాలు ఉండవు. మనలా ఆలోచించే, మనకు గురువులా బోధించి, దారి చూపి, తప్పు చేసినప్పుడు మందిలించే వ్యక్తి నిజమైన స్నేహితుడు. మంచి స్నేహితుల మధ్య ఎటువంటి మొహమాటాలు, రహస్యాలు ఉండవు. అవసరమైనప్పుడు నిస్సంకోచంగా తమ కష్టసుఖాలు ఒకరికొకరు పంచుకుంటారు. కష్ట సమయంలో కలత చెందిన మనసుకి వెన్నలా చల్లదనాన్ని, ప్రశాంతతను కలిగించే దివ్య ఔషధం స్నేహం.
 
స్నేహం ఓ మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలోను స్నేహ భావం ఉంటుంది. స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఒక్కోసారి కుటుంబసభ్యులతో కూడా చెప్పుకోలేని సమస్యలను ఈ ఆత్మీయ స్నేహితులతో నిర్మొహమాటంగా చర్చించవచ్చు. స్నేహంగా ఉన్నప్పుడు అనుమానం, కోపం, ద్వేషం కూడా దరిదాపులకు రావడానికి జంకుతాయి. స్నేహం అద్భుతమైంది. స్నేహానికి ఎల్లలు లేవు. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. 
 
మంచి స్నేహం వ్యక్తి వికాసానికి బాటలు వేస్తుంది. మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యంగా ఉంటుంది. ప్రతి వ్యక్తి జీవితంలోను విలువైన స్నేహాన్ని జీవితాంతం నిలుపుకునే ప్రయత్నం చేయాలి. స్నేహానికన్న మిన్నా లోకాన లేదురా... అన్నట్లు ఆ విలువైన బంధాన్ని అపురూపంగా కాపాడుకోవాలి.

వెబ్దునియా పై చదవండి