భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చిన్నారుల మరణ మృదంగం కొనసాగుతోంది. మొన్న గోరఖ్‌పూర్‌లోని బీఆర్డీ ఆస్పత్రిలో అనేక మంది చిన్నారుల మృత్యువాతపడ్డారు. సోమవారం ఫరూఖాబాద్ దావఖానాలో పదుల సంఖ్యలో చిన్నారులు చనిపోయారు. ఈ రాష్ట్రంలోని మిగిలిన ఆస్పత్రుల్లో కూడా ఇదే పరిస్థితులు నెలకొనివున్నాయి.
గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆసుపత్రిలో జరిగిన ఘటనను మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఫరూఖాబాద్‌లోని రామ్ మనోహర్ లోహియా రాజ్‌కియా చికిత్సాలయంలో నెల రోజుల వ్యవధిలో 49 మంది చిన్నారులు మృతి చెందారు. ఆక్సీజన్, మందుల కొరత వల్లనే చిన్నారులు మృతి చెందినట్లు సమాచారం.
ఘటనలో సీఎంవో, సీఎంఎస్ ఉన్నతాధికారులు సహా వైద్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారుల మృతిపై వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, యూపీ ఆస్పత్రుల్లో చిన్నారులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.