మహారాష్ట్ర ప్రజలపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఒకింత అసంతృప్తి వ్యక్తంచేశారు. ఏదైనా సమస్యకు పరిష్కారం కావాలనుకుంటున్నపుడు మాత్రమే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, కానీ ఎన్నికల విషయానికి వచ్చే సరికి తమను విస్మిరిస్తున్నారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
సమస్య వస్తేనే ప్రజలు తమ వద్దకు వస్తున్నారని, ఎన్నికల రోజు మాత్రం తమను పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. అయినప్పటికీ తాము ఎన్నికల ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగుతాయన్నారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణపై కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నట్టు వెల్లడించారు.
ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి 230 సీట్లను గెలుచుకుని అధికారం దక్కించుకున్న విషయం తెల్సిందే. ప్రతిపక్ష కూటమి కనీసం 50 సీట్లు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక 125 స్థానాల్లో పోటీ చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన ఒక్క సీటును కూడా దక్కించుకోలేకపోయింది. ముంబైలోని మాహిం స్థానం నుంచి బరిలో నిలిచిన రాజ్‌ఠాక్రే తనయుడు అమిత్ ఠాక్రే కూడా ఓడిపోయారు.