పులిని పట్టుకోండి.. లేకుంటే మేము పులిని పెళ్లి చేసుకుంటాం..?

బుధవారం, 10 మార్చి 2021 (11:04 IST)
Tiger
కర్ణాటక కొడగు జిల్లాలో ఒక పులి నలుగురిని చంపిన ఘటన కలకలం రేపుతోంది. దీంతో మంగళవారం అసెంబ్లీలో ఆసక్తికర చర్చ జరిగింది. ఈ చర్చలో సభ్యుల నుండి వెరైటీ కామెంట్లు వచ్చాయి. బీజేపీకి చెందిన విరాజ్‌పేట ఎమ్మెల్యే కేజీ బోపయ్య మాట్లాడుతూ 'మొదట ఆ పులిని పట్టుకోండి. మీరు పట్టుకోలేకపోతే, మాకు తెలియజేయండి. మేము అవసరమైన చర్యలు తీసుకుంటాము. మేము పులిని వివాహం చేసుకుంటాము ' అని అన్నారు.
 
అంటే ఆ ఎమ్మెల్యే 'నారి మంగళ' అనే పాత సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ, ఈ కామెంట్స్ చేశారు. ఈ ప్రాంతంలో పులి వేటగాడు తాను చంపిన పులిని వివాహం చేసుకుంటాడు. ఈ కొడగులో పులి వేటగాళ్లు సాంప్రదాయకంగా గౌరవించబడతారు. బోపయ్యకు సపోర్ట్‌గా మడికేరికి చెందిన ఎమ్మెల్యే అప్పచు రంజన్ మాట్లాడుతూ 'ఇది ఇప్పటికే నలుగురిని చంపింది. మీరు పట్టుకోలేకపోతే మేము ఆ పులిని చంపుతాము '. అని అన్నారు.
 
కాగా.. మంగళవారం నాటికి, బెల్లూరు గ్రామంలో ఎనిమిదేళ్ల బాలుడితో సహా గత ఇరవై రోజులలో పులి నలుగురిని చంపింది, దీని తరువాత సోమవారం గ్రామంలో 144 సెక్షన్ విధించబడింది. బాలుడి తాత సోమవారం తెల్లవారుజామున బాలుడిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తీవ్ర గాయాలతో మరణించాడు. అతను కాఫీ తోటలో పనిచేస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. 
 
కొడగు జిల్లాలోని విరాజ్‌పేట డివిజన్‌లోని శెట్టిగేరి, కుమటూరు, బెల్లూరు గ్రామాల్లోని గ్రామస్తులకు, పశువులకు ఈ పులి ముప్పు తెచ్చిపెడుతోంది. పులిని పట్టుకునేందుకు అటవీ శాఖాధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు