మరో 14 యాప్స్‌ను బ్లాక్ చేసిన కేంద్రం

సోమవారం, 1 మే 2023 (13:09 IST)
దేశంలో మరో 14 యాప్స్‌ను కేంద్రం బ్లాక్ చేసింది. జమ్మూకాశ్మీర్‌లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి వారి బాస్‌లు కోడె సందేశాలు పంపుతున్నట్టు భావించడంతో ఈ 14 యాప్స్‌ను కేంద్రం బ్లాక్ చేసింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు కశ్మీర్‌లో క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి, ఇతర ఆపరేటీవ్‌లకు సూచనలు, సందేశాలు పంపేందుకు వీటిని వినియోగిస్తున్నట్లు తేలింది. 
 
జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్‌ అప్లికేషన్లపై కేంద్రం గత కొన్నేళ్లుగా కొరఢా ఝుళిపిస్తుంది. ఈ క్రమంలో దాదాపు 250కి పైగా చైనా యాప్స్‌పై నిషేధం విధించింది. దేశ సార్వభౌమాధికారతను, సమగ్రతను కాపాడటం కోసం జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని వీటిపై నిషేధం విధించినట్టు ప్రభుత్వం అప్పట్లో తెలిపింది. వీటిలో టిక్ టాక్, షేరిట్, వీఛాట్, హెలో వంటి పాపులర్ యాప్‌లు కూడా ఉన్నాయి.
 
తాజాగా కేంద్రం బ్లాక్‌ చేసిన వాటిల్లో క్రిప్‌వైజర్‌, ఎనిగ్మా, సేఫ్‌వైజ్‌, వికర్‌మి, బ్రియార్‌, బీఛాట్‌, నాండ్‌బాక్స్‌, కొనియాన్‌, ఐఎంవో, ఎలిమెంట్‌, సెకండ్‌ లైన్‌, జంగీ, త్రిమా తదితర యాప్స్ ఉన్నాయి. దేశంలోని భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీల సిఫార్సుల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నారు. 
 
ఈ యాప్స్‌ భారత చట్టాలను ఉల్లంఘించడంతోపాటు, జాతీయ భద్రతకు ముప్పుగా మారాయి. దీంతోపాటు ఉగ్రవాదం ప్రచారంలో కూడా వీటిని వాడుతున్నారు 'కాశ్మీర్‌లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదుల కదలికలు, వారి సమాచార మాధ్యమాలపై ఏజెన్సీలు దృష్టిపెట్టాయి. కొన్ని యాప్స్‌నకు దేశీయంగా ఒక్క ప్రతినిధి కూడా లేని విషయం బయటపడింది. ఇలాంటి వాటిల్లో జరిగే కార్యకలాపాలను గుర్తించడం చాలా కష్టం' అని ఓ అధికారి వెల్లడించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు