లడఖ్ ప్రాంతంలో ఆకస్మిక పర్యటన చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ భారత సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. తన ప్రసంగంలో చైనా పేరెత్తకుండానే చురకలు అంటించారు. ముఖ్యంగా, విస్తరణవాదానికి కాలం చెల్లిందనీ, ఇది అభివృద్ధిశకం అంటూ వ్యాఖ్యానించారు.
లడఖ్‌లోని నీమూలో శుక్రవారం ఆకస్మిక పర్యటన జరిపిన ప్రధాని అక్కడి ఫార్వార్డ్ పోస్ట్‌లో సైనికులను ఉద్దేశించి ఉత్తేజభరితమైన ప్రసంగం చేశారు. 'విస్తరణ వాద శకం ముగిసింది. ఇది అభివృద్ధి శకం. విస్తరణ శక్తులు మట్టికరవడమో, తోకముడవడమో జరిగినట్టు చరిత్ర చెబుతోంది' అని ప్రధాని ఘాటుగా వ్యాఖ్యానించారు.
పైగా, లడక్ ప్రజలు తమ ప్రాంతాన్ని విడగొట్టేందుకు ఎవరు ఎలాంటి ప్రయత్నాలు జరిపినా తిప్పికొడుతూ వచ్చారని ప్రధాని గుర్తుచేశారు. 'దేశానికి లడక్ శిరస్సు వంటింది. 130 కోట్ల మంది భారత ప్రజలకు గర్వకారణం. దేశం కోసం అత్యున్నత త్యాగాలు చేసేందుకు సిద్ధపడే వారికే ఈ భూమి సొంతం. ఈ ప్రాంతాన్ని వేరుచేసేందుకు జరిపే ఎలాంటి ప్రయత్నాన్నైనా జాతీయభావాలు పుష్కలంగా ఉన్న లడక్ ప్రజలు తిప్పికొడతారు' అంటూ మోడీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.