కరోనా కష్టకాలంలో భారత్‌లో వ్యాక్సిన్ల కొరతకు ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వమేనని సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పునావాలా ఆరోపించారు. పైగా, వ్యాక్సిన్ల కొరత జులై వరకూ తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఈ కొరతకు బాధ్యత తమ కంపెనీది కాదు ప్రభుత్వానిదే అని కూడా అదర్ మరో బాంబు పేల్చారు.
జనవరిలో పరిస్థితి చూసి ఇక భారత్‌లో కరోనా పనైపోయిందని అందరూ భావించారు. రెండో దశను అంచనా వేయడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. రాజకీయ నాయకులు, విమర్శకులు వ్యాక్సిన్ కొరతకు మా కంపెనీని బదనాం చేశారు. కానీ దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. కంపెనీ అస్సలు కాదు అని అదర్ తేల్చి చెప్పారు.
కాగా, ప్రస్తుతం పుణెలోని సీరంలో నెలకు 6-7 కోట్ల కొవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులు తయారువుతున్నాయి. దీనిని మరో నెల రోజుల్లో నెలకు 10 కోట్లకు పెంచనున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదర్ చెప్పారు.
వ్యాక్సిన్ కోసం తనకు బెదిరింపులు వస్తున్నాయని, అందుకే ఇండియా వదిలి లండన్ వచ్చేసినట్లు ఆయన చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఇండియా వస్తానని, వ్యాక్సిన్ తయారీని పరిశీలిస్తానని తెలిపారు. ప్రస్తుతం అయితే కొవిషీల్డ్ ఉత్పత్తి పూర్తి స్థాయిలో ఉన్నట్లు చెప్పారు.