2018 డిసెంబర్ నాటికి భారత్-పాక్ సరిహద్దు షట్టర్ క్లోజ్.. షరీఫ్ తేనేటి విందులో?

శుక్రవారం, 7 అక్టోబరు 2016 (16:09 IST)
భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో రాజస్థాన్ పర్యటనలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూరీ ఘటనకు ప్రతీకారంగా ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్ చేశాయి.

ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ నాటికి భారత్-పాకిస్థాన్ సరిహద్దును మూసేస్తామని రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. 
 
సరిహద్దు ప్రాంతాల్లో బోర్డర్ సెక్యురిటీ గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సైనికులపై వ్యాపారం చేస్తున్నారన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రాజ్‌నాథ్ ఖండించారు. ప్రజలు దేశం కోసం ఏ ప్రాంతంలోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, రాహుల్ కాస్త నిగ్రహంతో మాట్లాడటం నేర్చుకోవాలని హితవు పలికారు.
 
ఇదిలా ఉంటే.. పాకిస్థాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌పై మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్షాఫ్‌ పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాక్‌ సరిహద్దు వెంట దాడులు జరిపామని భారత్‌ చెప్పుకొస్తుంటే.. కాదని చెప్పేందుకు షరీఫ్‌ ఒక్క ఆధారం చూపడంలేదని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఇంతచొరవ తీసుకోవడానికి షరీఫ్‌ అనుకూల సంకేతాలే కారణమని ఆరోపించారు. భారత్‌కు వెళ్లి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులతో కలిసి షరీఫ్‌ తేనీటి విందులో పాల్గొన్నారని దుయ్యబట్టారు. 

వెబ్దునియా పై చదవండి