మన రైల్వేల్లో విక్రయిస్తున్న ఆహారం మానవ వినియోగానికి తగినది కాదని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొనడంతో ఇన్నేళ్ల తర్వాత ఇండియన్ రైల్వేస్ మేల్కొంది. రోజూ కోట్లాదిమంది ప్రయాణీకులను గమ్యానికి తీసుకుపోయే భారతీయ రైల్వే వారికి ప్రయాణసమయంలో సరైన భోజనం పెట్టలేదనే అపప్రథను చిరకాలంగా మూట గట్టుకుని వస్తోంది. రైల్లో భోజనం అంటేనే ఆమడ దూరం పారిపోయే స్థితిని తీసుకువచ్చిన మన రైల్వేలు ఎట్టకేలకు మేల్కొన్నాయి. ఆహార పదార్థాల నాణ్యతను పెంచనున్నట్లు హామీ ఇచ్చింది. నూతన కేటగరింగ్ విధానంలో భాగంగా నూతన వంటశాలలను ఏర్పాటు చేయనుంది. ఆహార తయారీలో నాణ్యతను పెంచే చర్యలు చేపట్టడానికి సిద్ధమైంది.
రైల్వే స్టేషన్లు, రైళ్ళలో విక్రయించే ఆహార పదార్థాల నాణ్యతను పెంచేందుకు భారతీయ రైల్వే చర్యలను ప్రకటించింది. ఐఆర్‌సీటీసీ నూతన కేటరింగ్ విధానాన్ని రూపొందించిందని తెలిపింది. నూతన వంటశాలలను ఏర్పాటుచేయాలని, ప్రస్తుతం ఉన్న వంటశాలలను ఆధునికీకరించాలని ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌సీటీసీ) నిర్ణయించిందని పేర్కొంది. ఆహార తయారీలో నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.