ఎయిర్ టెల్‌పై కేసు వేసిన జియో.. ఎందుకో తెలుసా?

శుక్రవారం, 20 ఏప్రియల్ 2018 (20:53 IST)
రిలయెన్స్ జియో. టెలికాం రంగంలో ఓ సంచలనం. ఆది నుంచి ఆకట్టుకునే ఆఫర్లను తన కస్టమర్లకు అందిస్తూ వస్తోంది. జియో 4జి, రూటర్, జియో ఫోన్ త్వరలో జియో ల్యాప్ టాప్‌లు ఇలా ఎన్నో సేవలను జియో అందిస్తోంది. ఇక హైస్పీడ్ మొబైల్ డేటా తక్కువ ధరకు అందిస్తుందంటే జియో పుణ్యమే అని చెప్పొచ్చు.
 
జియో దెబ్బకు ప్రత్యర్థి కంపెనీలు కుదేలయ్యాయి అనేకంటే అంతకుముందు నుంచి ఏ రకంగా వినియోగదారుల నుంచి గుంజాయో అర్థం చేసుకోవచ్చనే విమర్శలు కూడా వచ్చాయనుకోండి. మొత్తమ్మీద జియో దెబ్బతో ఎయిర్‌టెల్ లేవలేని స్థితిలోకి వెళ్ళిపోయింది. తాజాగా జియో చేతిలో ఎయిర్ టెల్ మరోసారి భంగపడింది. 
 
ఐపిఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులు స్టార్ ఇండియాకు ఉన్నాయి. అందుకే టివి ఛానల్స్‌లో స్టార్‌కు చెందిన ఛానళ్ళలో మాత్రమే ఐపిఎల్ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. ఐపిఎల్ డిజిటల్ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ కూడా స్టార్ మీడియాకే ఉన్నాయి. అందుకే ఆ సంస్థకు చెందిన హాట్ స్టార్ యాప్‌లో ఐపిఎల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి.
 
ఈ క్రమంలోనే జియోతో పాటు ఎయిర్ టెల్ తమతమ కస్టమర్లకు తమ టీవీ యాప్‌ల ద్వారా ఉచితంగా ఐపిఎల్ మ్యాచ్‌లను చూసే అవకాశాన్ని కల్పించాయి. అంతవరకు బాగానే ఉన్నా ఎయిర్‌టెల్ మాత్రం సగం ఐపిఎల్ మ్యాచ్‌ల డిజిటల్ ప్రసారాలపై అభ్యంతరకర యాడ్‌ను ప్రదర్శించింది. కేవలం ఎయిర్ టెల్ 4జి సిమ్‌ను 4జి ఫోన్‌లో వేసుకుని ఎయిర్ టెల్ టివి యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఆ యాప్‌లో ఐపిఎల్ మ్యాచ్‌ను చూడవచ్చని యాడ్ ఇచ్చింది.
 
నిజానికి ఐపిఎల్ డిజిటల్ రైట్స్ తనకే ఉన్నట్లుగా ఎయిర్ టెల్ యాడ్లో బిల్డప్ ఇచ్చింది. దీంతో ఎయిర్ టెల్ పైన జియో కేసు పెట్టింది. ఢిల్లీ హైకోర్టులో కేసు వేయగా విచారణలో జియోకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు న్యాయమూర్తి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు