అమ్మ ఆరోగ్యం వీడని సస్పెన్స్.. వారం రోజుల పాటు నో బులిటెన్.. అభిమానుల్లో ఆందోళన

మంగళవారం, 18 అక్టోబరు 2016 (11:50 IST)
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత ఆరోగ్యంపై సందిగ్ధత వీడట్లేదు. ఆమె ఆరోగ్యంపై వారం తర్వాత బులిటెన్ విడుదల కాలేదు. దీంతో సోషల్ మీడియాలో ఆమె ఆరోగ్య పరిస్థితిపై వదంతలు వెల్లువెత్తుతున్నాయి. సైబర్ నిపుణులతో ఎప్పటికప్పుడు పోలీసులు తొలగింపజేస్తున్నారు. కొద్దివారాలుగా వదంతులు సృష్టిస్తున్న వారిపై 50 కేసులు నమోదుకాగా, ఎనిమిది మందిని ఇప్పటికే అరెస్టు చేశారు.
 
సోషల్‌మీడియా వినియోగదారులెవరూ ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని, లేనిపక్షంలో వారిపై కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతామని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. ఇప్పటికే పలుమార్లు ఆమె ఆరోగ్య పరిస్థితిపై బులెటిన్లు విడుదల చేసిన వైద్యులు వారంరోజులైనా ఎలాంటి సమాచారం ఇవ్వకపోడంపై తమిళనాడు ప్రజలు, పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
ఆదివారం నాడు సూపర్ స్టార్ రజినీకాంత్ అపోలో ఆసుపత్రిని సందర్శించారు. అమ్మ ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. దాదాపు ఇరవై అయిది నిమిషాలు ఆయన ఆసుపత్రిలో గడిపారు. అయితే అమ్మను చూసేందుకు రజనీకాంత్‌కు అనుమతి లభించలేదు.
 
కేంద్రమంత్రి పోన్ రాధాకృష్ణన్ అమ్మ ఆరోగ్యం పైన మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ జయలలిత ఆరోగ్యం గురించి వాకబు చేశారని చెప్పారు. ప్రధాని మోడీ త్వరలో చెన్నైకి వస్తారని, అమ్మను పరామర్శిస్తారని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి