కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. 2 చోట్ల మినహా 222 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 112 భాజపా సాధిస్తుందంటూ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించినవాటిలో అత్యధిగంగా చెప్తున్నాయి. ఐతే కాంగ్రెస్ పార్టీ తిరిగి తమదే అధికారం అని చెపుతోంది. మరి ఎవరికి ఎన్ని స్థానాలు వస్తాయన్నదానిపై ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైన ఫలితాలను ఒక్కసారి పరిశీలిద్దాం.
టైమ్స్ నౌ - టుడేస్ చాణక్య ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూస్తే, భాజపాకు 120, కాంగ్రెస్ పార్టీకి 73, జేడీఎస్‌కి 26, ఇతరులకు 3 స్థానాలు లభించవచ్చని తేలింది. ఇక జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్‌లో భాజపాకు 95-114, కాంగ్రెస్ పార్టీకి 73-82, జేడీఎస్‌కి 32-43, ఇతరులకు 2-3 స్థానాలు లభించవచ్చని తెలిపింది. ఏబీపీ, సీ-ఓటర్ సర్వేలో భాజపాకు 101-113 స్థానాలు వస్తాయని తేలింది.
కాంగ్రెస్ పార్టీకి 82 నుంచి 94 స్థానాలు రావచ్చని తెలిపింది.కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలు ఉన్నాయి. ఐతే లగడపాటి సర్వే మాత్రం కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా వుంది. మరోవైపు హంగ్ అసెంబ్లీకి కూడా అవకాశం వున్నట్లు మరికొన్ని సర్వేలు చెపుతున్నాయి. మరి ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారో తేలేందుకు మే 15 వరకూ ఆగాలి.