లైంగిక దౌర్జన్యం కేసు : హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్ అధికారులు

ఠాగూర్

శనివారం, 4 మే 2024 (14:36 IST)
కర్నాటక రాజకీయాలను హాసన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య దాడి కేసు ఓ కుదుపు కుదిపేస్తున్నాయి. ఈ కేసు విచారణ కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సిట్ అధికారులు... హాసనలోని ప్రజ్వల్ ఇంటికి వెళ్లారు. లైంగిక దౌర్జన్య దాడి కేసులో ఆయన ఇంట్లో పని చేసే సిబ్బందిని ప్రశ్నించనున్నారు. 
 
మరోవైపు, ప్రజ్వల్‌పై రెండోసారి లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేసినట్లు రాష్ట్ర హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. ఆయన తండ్రి రేవణ్ణ కూడా విదేశాలకు వెళ్లిపోయే అవకాశం ఉన్నందున ఆయనకూ ఈ నోటీసులిచ్చినట్లు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌).. ఇటీవల వీరిద్దరినీ విచారణకు పిలిచింది. 
 
అయితే, తనకు సమయం కావాలని ప్రజ్వల్‌ కోరారు. ఇందుకు తిరస్కరించిన అధికారులు.. ఆయనపై తొలిసారి లుక్‌ఔట్‌ నోటీసు జారీ చేశారు. ఈ కేసు వెలుగులోకి రాగానే ప్రజ్వల్‌ దేశం విడిచి వెళ్లిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఈ నోటీసులతో ఆయన దేశంలో అడుగుపెట్టగానే పోలీసులు కస్టడీలోకి తీసుకునే వీలు ఉంటుంది.
 
ఇదిలావుంటే, లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ శనివారం లేఖ రాశారు. ఈ దారుణాలకు పాల్పడిన వ్యక్తులకు శిక్ష పడేలా చేయాలని, బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందించారు. 'ప్రజ్వల్‌ కేసు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ కేసులో పారదర్శక విచారణ జరిగేలా మేం కృషి చేస్తాం' అని తెలిపారు. మరోవైపు దర్యాప్తు వివరాలను తెలుసుకునేందుకు సీఎం నేడు సిట్‌ అధికారులతో సమావేశమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు