కేరళలో భారీ వరదలు.. 300 మందికి పైగా మృతి.. తినడానికి తిండి లేక..?

శనివారం, 18 ఆగస్టు 2018 (11:08 IST)
భారీ వర్షాలు కేరళను ముంచెత్తాయి. వరదలతో కేరళ అతలాకుతలమైంది. ఇప్పటికే మూడు వందల మందికి పైగా మృతి చెందారు. 3లక్షల మందికిపైగా నిరాశ్రయులయ్యారు. రాష్ట్రంలో 14 జిల్లాలుంటే 12 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ 20 హెలికాఫ్టర్లతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. నేవీ, ఐటీబీపీ బృందాలకు స్థానిక మత్స్యకారులు తమ బోట్లతో సహాకారం అందిస్తున్నారు. 
 
40వేల మంది పోలీసులు, 3వేల 2వందల మంది ఫైర్‌ ఫైటర్స్‌, 18 ప్రత్యేక బృందాలు, 28 కోస్ట్ గార్డ్‌ టీంలు, 39 ఎన్డీఆర్‌ఎఫ్‌, 46 నేవీ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమైవున్నాయి. ఇప్పటికే కేరళ చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో హెలికాప్టర్‌ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా వీక్షించనున్నారు. ఏరియల్ సర్వే ద్వారా కేరళ వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 
 
వర్షాలు, వరదల దెబ్బకు కేరళ వాసులు వణికిపోతున్నారు. జలవిలయానికి తోడు ప్రకృతి ప్రకోపించడంతో లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు చేరడంతో లక్షలాది మంది కట్టు బట్టలతో నిరాశ్రయులుగా మిగిలిపోయారు.
 
కేరళ రాష్ట్రాలను ఆదుకునేందుకు పలు రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ 25 కోట్లు, ఏపీ సర్కార్ 10 కోట్ల రూపాయలు వరదసాయంగా ప్రకటించాయి. అంతేకాకుండా పంజాబ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు ఫుడ్‌ ప్యాకెట్లను కేరళకు పంపించాయి. టాలీవుడ్‌, శాండల్‌‌వుడ్‌, కోలివుడ్‌ హీరోలు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు. 
 
వరద బీభత్సానికి శుక్రవారం సాయంత్రం వరకు 173 మంది మృత్యువాత పడ్డారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే 106 మంది ప్రాణాలు కోల్పోయారంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు